Pelli o comedy story
కొత్తగా ఉద్యోగం లో చేరాక మనకు తెలిసిన వాళ్ళెవరైన కనిపిస్తే.. "ఎలా ఉన్నావు? " అని అడిగినా అడగకపొయినా "పెళ్ళెప్పుడు? " అని మాత్రం తప్పకుండా అడుగుతారు.
సినిమాల్లో పెళ్ళి కాని అమ్మాయిల కష్టాలు చూపిస్తారు కానీ చదువు అవగొట్టి, ఉద్యోగం తెచ్చుకుని, పెళ్ళి కాని అబ్బాయిల బాధలు ఎవ్వరూ పట్టించుకోరు.
నా ఫ్రెండు ఒకడు "ఇంకో సంవత్సరం దాకా నాకు పెళ్ళి ఒద్దు మొర్రో " అని ఎంత గింజుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినలా..
తన మాటలు నచ్చక అందరూ రెండు రోజులు భోజనం మానేస్తారేమో అనుకున్నాడు. కానీ వీడికి తిండి పెట్టడం ఆపేసారు. దాంతో ఒప్పుకోక తప్పలేదు.ఇలాంటి పరిస్థితే దాదాపు అందరిదీ.
పెళ్ళికి ఒప్పుకోగానే మన బాధ్యతంతా అయిపోదు. నిజానికి అప్పటి నుంచే అసలు టార్చర్ మొదలు.
మొదట చెయ్యవలసింది..పెళ్ళి ళ్ళ మార్కెట్లోకి వదలటానికి మంచి ఫొటోలు తీయించుకోవటం.
ఫొటోలు: ఏ ఫొటోలు పడితే అవి ఇవ్వకూడదంట..స్టూడియో లో నీలం గుడ్డ ముందు నుంచుని ఒకటి, కుర్చీలో కూర్చుని ఒకటి, ఫొటో మొత్తం మొహం మాత్రమే కనపడేలా ఒకటి తీయించుకోవాలి. "ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు " అన్నామంటే.. మనము ఇంటర్మీడియట్లో పరీక్ష హాల్ టికెట్ కోసం తీయించుకున్న ఫొటో ఇస్తామని బెదిరిస్తారు.
పెళ్ళి సంబంధాల కోసం ఫొటోలు తీయటానికి 'స్పెషలిస్ట్ 'లు ఉంటారు. వీళ్ళ దృష్టిలో అక్కడకు ఫొటో లు తీయించుకోవటానికి వచ్చిన వాళ్ళంతా శత్రు దేశ యుధ్ధ ఖైదీలు..స్టూడియో లోకి వెళ్ళగానే ఇంటరాగేషన్ టైము లో వేసినట్టు పెద్ద పెద్ద లైట్లు వేస్తారు. "సరిగ్గా నుంచోండి సార్..కాస్త నవ్వండి..పై పళ్ళు నాలుగు, కింది పళ్ళు ఒకటిన్నర మాత్రమే కనపడాలి...ఎక్కువగా నవ్వకండి...ఆ చొక్కా గుండీ మీద ఇంకు మరకేంటి..తుడిచెయ్యండ ి "....ఇలా ఓ గంట సేపు రాగింగ్ చేసాక ఏవో ఫొటోలు తీసి పంపుతాడు. ఫొటోలు తీసినంత సేపూ మన మొహంలో ఏ పార్టూ సరిగ్గా లేదంటూ నిముషానికి ఒకసారి ఏడిపించి, అవమానించి..మన దగ్గర 1000 నుంచి 1500 రూపాయలు గుంజేస్తాడు.
బయోడాటా: ఫొటోలు రెడీ అయ్యాక చెయ్యవలసిన పని బయోడాటా తయారు చెయ్యటం. మన గురించి, మన అలవాట్ల గురించి చాలా జాగ్రత్తగా రాయాలి. ఈ బయోడాటా మాటి మాటికీ మారుస్తూ ఉంటే చాలా ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుంది.
నా ఫ్రెండొకడు పేపర్ లో 'వధువు కావలెను ' అనే ప్రకటన లో మొదట "కట్నం లేకున్నా పరవాలేదు " అని ఇచ్చాడు. వాడికి తెలిసిన వాళ్ళెవరో "అలా ఇస్తే నీలో ఎదో లోపముందనుకుంటారు " అన్నారట. "కట్నం తప్పనిసరిగా కావాలి " అని మార్చాడు. అయినా లాభం లేక పొయ్యింది. ఇలా కాదని.. "కట్నం తీసుకు రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తాను..ఖబడ్దార్ !" అని మార్చాడు. కొత్త సంబంధాలు ఏమీ రాలేదు కానీ పోలీసుల నుంచి ఫోను మాత్రం వచ్చింది...
అందుకే మొదటి సారే ఆచి తూచి బయొడాట తయారు చేసుకోవాలి. "సిగరెట్టు, మందు అలవాటు లేదు " లాంటి చిన్ని చిన్ని అబధ్ధాలు పరవాలేదు కానీ "నేను అందంగా ఉంటాను..రోజూ ఎక్సరసైసు చేస్తాను...అజీత్ అగార్కర్ బౌలింగ్ బాగా వేస్తాడు"... లాంటి పచ్చి బూతులు రాయకూడదు...అసలుకే మోసం వస్తుంది.
మధ్యవర్తులు: వీళ్ళు చేసే అన్యాయం అంతా ఇంతా కాదు - మనకు నెలనెలా వచ్చే జీతం నుంచి..మన అండర్వేరు సైజు వరకు ఎవ్వరికీ చెప్పని వ్యక్తిగత విషయాలన్నీ దబాయించి అడిగి తెలుసుకుంటారు..వాళ్ళ ు తెచ్చిన ప్రతీ సంబంధానికి "అమ్మాయి భూమిక లాగ ఉంటుంది..కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు " అంటారు. తీరా వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి అమ్రీష్ పురి లాగ ఉంటుంది.
ఇంట్లో వాళ్ళ కంగారు: ఒక్క సారి సంబంధాలు చూడటం మొదలు పెట్టాక ఇంట్లో వాళ్ళు పడేదానికన్నా మనల్ని పెట్టే కంగారు ఎక్కువ.ఇంటికి వచ్చిన ప్రతీ వాడితో "మా వాడికి ఏవైన సంబంధాలు ఉంటే చూడరదూ " అంటారు. ఆ వచ్చినోడు మనల్ని ఎగా దిగా చూసి "నువ్వు కాస్త నీటుగా ఉండే బట్టలేసుకోవాలి మరి....అలా జుట్టు పెంచుకుంటే కుదరదు" అని ఐదు పైసల సలహాలు రెండు ఇచ్చి పోతాడు. ఛీ.. ఇలా మాటలు పడటం కన్నా ఆ ఆడ అమ్రీష్ పురి ని చేసుకోవటం మేలనిపిస్తుంది.
జాతకాలు: పిల్లవాడు పుట్టాక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవటం మరచిపొయ్యినా జాతకం రాయించటం మాత్రం పొరపాటున కూడా మరువరు తల్లిదండ్రులు. పెళ్ళిళ్ళు కుదరటం వెనకాల ఉన్న కష్టాలు తెలుసుకున్న జ్యోతిష్యులు జాతకాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు.
నా ఫ్రెండు దినకర్ జాతకం ఓ జ్యోతిష్యుడు ఇలా రాసాడు:
చదువు - అద్భుతం
ధనం - అద్భుతం
కళ్యాణ యోగం - అద్భుతం (conditions apply)
మనతో పాటూ చదువుకున్న వాళ్ళ పెళ్ళిళ్ళయ్యే కొద్దీ ఇంట్లో వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది...."వాడిని అడిగైన తెలుసుకో ఏమి తప్పు చేస్తున్నావో " అంటారు. మనమేమీ మాట్లాడలేము. మనతో పాటూ ఫెయిల్ అవుతున్న ఫ్రెండు సడన్ గా 35 మార్కులతో పాస్ అయ్యి "పరీక్షలలో పాస్ కావటం ఎలా " అని సలహా ఇచ్చినట్టు... వాడూ ఏవో రెండు మాటలు చెప్తాడు.
ఇంట్లో వాళ్ళ ఎమొషనల్ బ్లాక్మెయిల్ వల్ల పెళ్ళికి సిధ్ధ పడ్డ అబ్బాయిలు చాలా మంది తెలుసు నాకు.
అమ్మాయిలకు జరిగే బలవంతపు పెళ్ళిళ్ళతో పోల్చుకుంటే ఇది పెద్ద సమస్య కాదు...అలా అని మరీ కొట్టిపారేసేంత చిన్నదీ కాదు..అందుకేనెమో ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని ఎక్కువ మంది గుర్తించరు...
0 comments:
Post a Comment